Kadapa RTC Garage: కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. గత కొన్నేళ్ల నుంచి వెంటాడుతుంది. వర్షం నీరు ఒక్కసారి గ్యారేజ్‌లోకి చేరితే కనీసం నాలుగైదు రోజులపాటు అలాగే నిల్వ ఉంటాయి. మెకానిక్‌లు ఆ నీటిలోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది.
బస్సులు గంటల తరబడి గ్యారేజీ నీటిలో ఉండటంవల్ల టైర్లు దెబ్బతింటున్నాయి. దీంతో మార్గమధ్యలో బస్సులు మోరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నీళ్లలో నిలబడి మరమ్మతులు చేయలేక మెకానిక్‌లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిలో ఉన్న ఆర్టీసీ గ్యారేజీ మరెక్కడో కాదు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉంది.
ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!
కడపలో ఆర్టీసీ గ్యారేజీ చెరువును తలపిస్తోంది. మిగ్జాం తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప ఆర్టీసీ గ్యారేజీలో మోకాళ్లోతు నీళ్లు చేరాయి. ఇలా వర్షం కురిసిన ప్రతిసారి నీళ్లు రావడం పరిపాటిగా మారింది. ఇక్కడ 150 బస్సు సర్వీసులు 100మందికి పైగా మెకానిక్‌లు విధులు నిర్వహిస్తుంటారు. వర్షం వస్తే చాలు కార్మికులు ఆ నీటిలోని నిలబడి బస్సుల మరమ్మతులు చేయాల్సి వస్తుంది.
విష కీటకాలతో మెకానిక్‌లు భయాందోళనకు గురవుతున్నారు. బస్సు టైర్లు గంటల తరబడి నీటిలో ఉండడం వల్ల అవి మార్గమధ్యలో మోరాయిస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు 2021లో ఆర్టీసీ గ్యారేజ్‌ను పరిశీలించిన సమయంలో వర్షపు నీటిలో మెకానిక్‌ల పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పక్కనే కొత్త గ్యారేజీ నిర్మాణానికి 2022 జనవరిలో భూమి పూజ చేశారు.