కడప జిల్లాలో ఇటీవల అక్రమ బంగారం భారీగా పట్టుబడుతోంది. మేలిమి పసిడి ఆభరణాలు లభిస్తాయనే పేరున్నందున... ఈ ప్రాంతంలో కొనేందుకు జనం ఆసక్తి చూపుతుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు... పన్నులు ఎగ్గొట్టేందుకు బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా చెన్నై నుంచి తరలిస్తున్న దాదాపు 7 కిలోల పసిడిని పోలీసులు పట్టుకున్నారు.
బిల్లులు తప్పనిసరి
బంగారు ఆభరణాలు తయారుచేసి మరో ప్రాంతానికి తరలించాలంటే తగిన బిల్లులు ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయపన్ను, ఇతర రకాల సుంకాలు చెల్లించాలి. అలాంటివి ఎగ్గొట్టేందుకు కొందరు వ్యాపారస్థులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గురువారం చెన్నై నుంచి కడపకు 6 కిలోల 930 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.