FLOODS EFFECT IN KADAPA: అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి చెయ్యేరుకు వరద పోటెత్తటంతో పెనగలూరు చెరువుకట్ట తెగిపోయింది. పెనగలూరు-ఎన్.ఆర్.పురం ప్రధాన రహదారికి ఏడుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. ఆ రహదారి మూడు కిలోమీటర్ల పొడవున ఉనికే లేకుండా పోయింది. ఫలితంగా ఎన్‌ఆర్‌పురం, పల్లంపాడు, కోడిచిన్నయ్యగారిపల్లె, పద్మయ్యగారిపల్లె, ఏరాసుపల్లె ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాల్లో అనారోగ్యం బారినపడిన కొందరు బయటకు రావడానికి దారి లేక.. చికిత్స అందక ప్రాణాలు కోల్పోయారు. ‘ఈనాడు ప్రతినిధి’ ఆయా గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి కన్నీటిగాథలు అనేకం కనిపించాయి.
పెనగలూరు-ఎన్.ఆర్.పురం రోడ్డు వరద ఉద్ధృతికి పూర్తిగా తెగిపోయింది. ప్రత్యామ్నాయంగా చెయ్యేరు కరకట్టపై నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేస్తున్నారు. పెద్దపెద్ద రాళ్లతో ఉన్న దానిపై ద్విచక్రవాహనం వెళ్లటమే కష్టంగా ఉంది. దీంతో ఆయా గ్రామాల్లో జ్వరాలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారంతా ఆసుపత్రిలో చూపించుకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలోని పెనగలూరుకు తెగిపోయిన చెరువుకట్ట మీదుగా కొంత దూరం, చెరువు లోపల నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. మరికొందరు నిత్యావసరాలు, అత్యవసర ఔషధాల కోసం కాలినడకన వెళుతున్నారు. ‘నా భార్య గంగమ్మకు నాలుగు రోజులుగా గొంతునొప్పి, జ్వరం. నాకు కూడా చేతికి దెబ్బ తగిలింది. పెనగలూరు ఆసుపత్రికి వెళ్దామంటే రోడ్డు తెగిపోయింది. కాలినడకనే వెళుతున్నాం’ అన్నారు ఎన్‌ఆర్ పురానికి చెందిన మాలె శివనారాయణ.
పల్లంపాడుది మరో కథ
వరద ముంచెత్తటంతో పల్లంపాడు-ఎన్‌ఆర్‌పురం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ నది కనిపిస్తోంది. ఈ గ్రామంలో అనేకమంది జ్వరాలతో బాధపడుతున్నారు. వరదల వల్ల ఆసుపత్రికి వెళ్లలేక 4 రోజుల కిందట ఎలుకచర్ల పిచ్చయ్య, శనివారం గండికోట పెంచలమ్మ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు జ్వరపీడితులు నడుంలోతు నీటిలో నది దాటుకుని ఎన్‌ఆర్‌పురం వచ్చి, కాలినడకన పెనగలూరు వెళ్తూ కనిపించారు.