కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డి వారిపల్లి అరుంధతి వాడకు చెందిన బావ, బావమరిది శేఖర్, చెన్నయ్యలు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లారు. సరదాగా సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లిన వారు.. అలల తాకిడికి మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
శేఖర్(34), చెన్నయ్య(40) బావ, బావమరిది.. పొట్టకూటి కోసం రెండు సంవత్సరాలు క్రితం కువైట్కు వలస వెళ్లారు. అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబ అవసరాలకు డబ్బులు పంపించేవారు. గత ఆరు, ఏడు నెలలుగా కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడ్టారు. సంక్రాంతికి ఇంటికి వస్తామని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. శుక్రవారం సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన వారు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారని కువైట్ నుంచి సమాచారం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకొని.. మృతదేహాలు ఇంటికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు.