MP AVINASH AT CBI ENQUIRY: మాజీ మంత్రి వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ కార్యాలయానికి హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, అవినాష్‌రెడ్డి అనుచరులు సీబీఐ కార్యలయానికి భారీగా చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీబీఐ కార్యాలయం వద్ద పోలీసు భారీగా మోహరించారు. ఎటువంటి గొడవలు జరగకుండా అవినాష్ అనుచరులను సీబీఐ కార్యాలయ పరిసరాల నుంచి పోలీసులు పంపించారు. గత నెల ఫిబ్రవరి 28న అవినాష్‌ను సీబీఐ నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
అయితే వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్రమైన అభియోగాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని సీబీఐ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. విచారణ కోసం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ విచారణలో నెల రోజుల వ్యవధిలో జరిగిన కీలక పరిణామాలు, సీబీఐకి వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి, వివేకా హత్య కేసులో దాగి ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు సమాచారం. గత నెల ఫిబ్రవరి 28న ప్రశ్నించిన సమయంలో అవినాష్ ఫోన్ నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పని చేసే నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ఆధారాలు సంపాదించింది. అవినాష్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ నెల 3వ తేదీన నవీన్, కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు కడపలో విచారించారు. ఈ పరిణామాలు అన్నింటిపైనా అవినాష్‌రెడ్డిని ఈరోజు మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.