మహిళా జైలు వార్డెన్‌ను వరించిన రాష్ట్రపతి అవార్డు తూర్పుగోదావరి జిల్లా మహిళా జైల్లో 1999లో వార్డెన్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన నాగమణి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కడప మహిళా ప్రత్యేక కారాగారంలో చీఫ్ హెడ్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఖైదీల పట్ల ప్రేమ, జాలి చూపిస్తూ వారు పడే మనోవేదన నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారు. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి మానవతా దృక్పథంతో సేవలు అందిస్తారు. ఈ పనితీరే ఆమెకు రాష్ట్రపతి అవార్డును తెచ్చిపెట్టింది. మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా..!
వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. నాగమణికి ఈసారి రాష్ట్రపతి సంస్కరణల సేవా పతకం వరించింది. జైళ్ల శాఖలో వచ్చిన మూడు అవార్డుల్లో ఏకైక మహిళగా ఈమె నిలవడం గమనార్హం. తనకు ఈ అవార్డు రావడంపై నాగమణి సంతోషం వ్యక్తం చేశారు. తాను అందరితో కలిసిపోయి తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని.. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని నాగమణి అన్నారు.
అధికారుల అభినందన
నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల జైలు ఇంఛార్జీ సూపరింటెండెంట్ వసంత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జైళ్ల శాఖకు మూడు అవార్డులు రావడం అందులో తమ కారాగారానికి చెందిన నాగమణికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నాగమణికి రాష్ట్రపతి అవార్డు రావడంపై ఇతర జైలు సిబ్బంది, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు మహిళలందరికీ దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని నాగమణి మరింత గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:
'మండలి రద్దు'పై మండిపడ్డ రాజధాని రైతులు