ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సంరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లాకు అగ్రస్థానం - నీటి సంరక్షణలో డప జిల్లాకు అగ్రస్థానం

ప్రతి ప్రాణికి జలం ఎంతో అవసరం. దేశంలో భారీగా జనాభా పెరుగుతుండడంతో నీటి కొరత ఏర్పడుతోంది. కొన్నేళ్లపాటు ఇలాంటి పరిస్థితే కొనసాగితే నీటి సమస్యలు తీవ్రతరమవుతాయి. ఈ నేపథ్యంలో జల సంరక్షణకు నడుం బిగించాల్సిన అవసరమేర్పడింది. ఇందుకోసం జిల్లాలో గత రెండేళ్లుగా అధికారులు చేపట్టిన వివిధ పనులతో జాతీయస్థాయిలో ప్రశంసలతోపాటు పురస్కారాలు వరిస్తున్నాయి. 2019 జాతీయ నీటి అవార్డుల ప్రధాన కార్యక్రమం దిల్లీలో బుధవారం జరిగింది. జల పరిరక్షణ విభాగంలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో పురస్కారం సాధించడంపై కలెక్టర్‌ హరికిరణ్‌ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు, కేంద్ర నోడల్‌ అధికారి సురేష్‌కుమార్‌ ప్రశంసించారు.

first rank in water conservation
నీటి సంరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లాకు అగ్రస్థానం

By

Published : Nov 12, 2020, 7:12 AM IST

కడప జిల్లాకు తాజాగా పురస్కారం రావడానికి గతేడాది జలశక్తి అభియాన్‌ కింద చేపట్టిన... పనులే ప్రధాన కారణమని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2019లో దేశవ్యాప్తంగా కరవు ప్రభావం అధికంగా ఉన్న 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేయాలనే ఉద్దేశంతో జలశక్తి అభియాన్‌ కార్యక్రమం నిర్వహించింది. దీనికి రాష్ట్రంలో కడప జిల్లాతో కలిపి మొత్తం 9 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో చిన్నమండెం, కమలాపురం, రైల్వేకోడూరు, లింగాల, ఓబులవారిపల్లె, పెనగలూరు, పోరుమామిళ్ల, పుల్లంపేట, రాజంపేట, సంబేపల్లె, సింహాద్రిపురం, వేంపల్లె, వేముల మండలాల పరిధిలో భూగర్భజలాలను అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల పనులు చేపట్టారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా ఉపాధిహామీ పథకం కింద 19,829 పనులు చేపట్టగా, ఇతర విభాగంలో 1,98,031 చేశారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన వంద శాతం పనులను జియోట్యాగింగ్‌ చేశారు. సుమారు నాలుగు నెలల కాలంలో 60,207 కృషి విజ్ఞాన కేంద్ర మేళాలు నిర్వహించారు. వీటి ద్వారా రైతులు, విద్యార్థులు, మహిళలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. గతేడాది అక్టోబరు నాటికి మొత్తం 100 మార్కులకు 84.84 మార్కులతో జిల్లా దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.

భూగర్భజలాల వృద్ధి

గత పదేళ్లలో అధికారులు ఏడేళ్లపాటు కడపను కరవు జిల్లాగా ప్రకటించారు. ఇక్కడి రైతులు పంటలు సాగు చేసుకోవడానికి అధికంగా బోర్లు తవ్వుతుండడంతో భూగర్భజలాలు ఇంకి పోయాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు నీటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిపై గత రెండేళ్లుగా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా 76,621 పంట కుంటల నిర్మాణం చేపట్టగా, 8.64 మీటర్ల మేర భూగర్భజలాలు వృద్ధి చెందినట్లు అధికారులు గుర్తించారు. నీటి సంరక్షణ కట్టడాలు, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు-నగరి సుజల స్రవంతి, కడప- కర్నూలు కాలువల ద్వారా చెరువులు, చెక్‌డ్యాంలను నింపారు. ఫలితంగా గతంలో భూగర్భజలాలపై ఆధారపడిన 92 శాతం ఆయకట్టుకు సాగునీరందింది.

వరుసగా రెండేళ్లు అగ్రస్థానం

దక్షిణాది రాష్ట్రాల పరిధిలో జిల్లాకు వరుసగా రెండేళ్లు అగ్రస్థానం లభించింది. 2018లో ఆకాంక్షిత జిల్లాల విభాగంలో పురస్కారం అందుకోగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచాం. మేం గత రెండేళ్లుగా నీటి సంరక్షణలో చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. జిల్లాకు పురస్కారం రావడానికి డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, భూగర్భజలశాఖ డీడీ మురళీధర్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. వారికి అభినందనలు. - హరికిరణ్‌, కలెక్టర్‌

ఇదీ చదవండీ...

మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details