కడప జిల్లా రైల్వేకోడూరులో కొన్నేళ్లుగా కోచ్ పుల్లయ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఇందులో ఎక్కువమంది పేదవారే. అరకొర వసతులతోనే పుల్లయ్య ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన చాలామంది పతకాలతోపాటు ఉద్యోగాలు సాధించారు.
కోచ్ పుల్లయ్య సహకారంతోనే తాము విజయాలు సాధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకున్నా.. దాతల సాయంతో వసతులు కల్పించి.. తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ప్రో కబడ్డీ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
'నేను ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో పీఈటీగా పని చేస్తున్నా. రైల్వేకోడూరులోని అనేక పాఠశాలలో కబడ్డీపై మక్కువ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటున్నా. వారికి అరకొర వసతులతో శిక్షణ ఇస్తున్నా. స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆర్థికంగా సాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రతిభ కలిగిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. నా వద్ద శిక్షణ తీసుకున్న 17 మంది విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు స్పందించి కబడ్డీ క్లబ్ ఏర్పాటు చేసి ఆర్థికంగా సాయపడితే రాష్ట్రానికే మంచి పేరు తీసుకువస్తాను'