కరోనా సోకిన మహిళ మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయొద్దంటూ ప్రజలు ఆందోళన చేసిన ఘటన కడప జిల్లా నందలూరులో జరిగింది. మండలంలోని ఆడపూరుకు చెందిన పుష్పలత అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో పుణెలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మృతదేహానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేసి.. కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.
స్పందించిన అధికారులు ఆడపూరు గ్రామానికి చేరుకుని ఆమె ఖననానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఇక్కడ దహనసంస్కారాలు చేయొద్దంటూ ఆందోళన చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అన్ని జాగ్రత్తలతో ఖననం చేస్తామని.. ఆమెతోపాటు వాహనంలో వచ్చేవారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అయినప్పటికీ గ్రామస్థులు వినడంలేదు. ఇంకా పుష్పలత మృతదేహం గ్రామానికి చేరుకోలేదు.