అకాల వర్షం, హోరు గాలి కారణంగా.. అరటి పంట నేలకూలుతున్నా.. టన్ను ధర రూ.15 వేల నుంచి రూ.2 వేలకు పడిపోయినా.. రైతన్న ఆరాటం మాత్రం తగ్గడం లేదు. కొత్త సాగు ప్రారంభించి... పశుపక్ష్యాదుల నుంచి రక్షణకు ఈత ఆకు గొడుగులు అమర్చి సాగులో కొత్త మెళకువలతో ముందుకు సాగుతున్నాడు. ఈ మండుటెండల్లో ఏ మొక్క నాటినా బతకడం కష్టం. ఇప్పుడు మొక్కలను బతికించుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో దిగుబడులు చేతికి వస్తాయని... ధరకు ఢోకా ఉండదని ఇక్కడివారి లెక్క.
ఇలా అరటికి ఈత ఆకు కొమ్మలు అమర్చడమూ ఏమంత సులువు కాదు. ఒక్కో కొమ్మను అనంతపురం జిల్లాలో రూ.2 వెచ్చించి కొనుగోలు చేసుకొస్తున్నారు. పులివెందుల, రైల్వేకోడూరు రాజంపేట, ప్రొద్దుటూరు, వేంపల్లె, వేముల మండలాల్లో అరటి పంట సాగుచేసే రైతులు ఈత ఆకులను ఎండ నుంచి రక్షణగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో 8 వేల ఎకరాల్లో కొత్తగా పంట సాగు- రక్షణ చర్యలు ఇలా సాగుతున్నాయని జిల్లా ఉద్యాన అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.