ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగల్లు .. రైతులకెప్పుడు నీటి జల్లు!

వరుణదేవుడు కరుణిస్తే గాని పుడమి మేను పచ్చబడని ప్రాంతం అది. సాగునీరు లేక దశాబ్దాల తరబడి వేల ఎకరాలు బీడులై పోతున్న పరిస్థితి. వర్షాధార నదులు, వాగు వంకల ద్వారా వచ్చే నీటిని నిలువరించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు నీరుగారి పోతున్నాయి. నిధుల లేమి, గుత్తేదారుల చేతివాటం సాగునీటి పథకాలు ఏళ్ల తరబడి సాగుతున్నారు. కడప జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులకు కొదవలేదు. గండికోట బ్రహ్మంసాగర్, వెలిగల్లు, జెర్రీ కోన మడిపల్లి రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్టు, పీబీసీఆర్​ఆర్​ కేసీ కెనాల్ వంటి సాగు నీటి ఆధారిత పథకాలు ఉన్నా చుక్క నీరు కోసం రైతన్నలు కళ్లు కాయలు కాసేలాచూస్తున్నారు. వెలిగల్లు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

By

Published : Jun 1, 2020, 7:45 PM IST

veligallu project
veligallu project

కడప జిల్లాలో పెన్నా, మాండవ్య, పాపాగ్ని, చెయ్యరు, పించా, బాహుదా, కుందూ నదులన్నీ వర్షాధారంగా ప్రవహిస్తాయి. కరవు పీడిత ప్రాంతాలైన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె రైతుల కష్టాలు తీర్చేందుకు 1994-95లో అప్పటి తెదేపా ప్రభుత్వం వెలిగల్లు వద్ద పాపాగ్ని నదిపై ప్రాజెక్టు నిర్మించేందుకు పునాది వేసింది. అప్పటి నుంచి విడతల వారీగా నిధులు రావడంతో పనులు నత్తనడకన జరుగుతున్నాయి. 2005లో వైఎస్సార్​ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞం పథకంలో వెలిగల్లు ప్రాజెక్టు చేర్చి రూ.208 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో పనుల వేగం పెరిగింది. స్పిల్​ వే, కుడి, ఎడమ కాల్వల పనిపూర్తైంది. ప్రాజెక్టు కింద 2500 ఎకరాలను నికర ఆయకట్టు నిర్ధరించారు. పరోక్షంగా మరో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది.

  • తెదేపా ప్రభుత్వం విచారణ

అనంతరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో .. పనులు నిలిచిపోయాయి. 2014లో తెదేపా అధికారంలోకి రాగానే కాల్వల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన నిపుణుల బృందం సుమారు రూ.9 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ విచారణ సమయంలోనే గుత్తేదారులు కాల్వలకు మరమ్మతులు చేశారు. దీంతో ప్రాజెక్టులోకి కొంత మేర నీరు చేరింది. ఈ కొద్దిపాటి నీటిని ప్రధాన కాల్వ ద్వారా గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లోని చెరువులు నింపారు. ఆయకట్టు హెచ్చుతగ్గులను అనుసరించి రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, వాటి పనులు ఇంకా పూర్తి కాలేదు.

  • తొలి జలయజ్ఞం ప్రాజెక్టు కానీ

ప్రధాన కాలువల్లో గోడల అడుగు భాగాన కాంక్రీట్ లేకపోవడంతో... మట్టి చేరి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాజెక్టు నిర్మించారని ఆశ పడ్డ రైతులు... 13 ఏళ్లుగా సాగునీటి కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు చిత్తూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం పరిధిలో కురిసే వర్షాలతోనే నీరు అందుతుంది. గత 15 ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడడంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ డెడ్ స్టోరేజ్​కే పరిమితం అవుతోంది. 2008లో ప్రాజెక్టు ప్రారంభ సమయంలో.. నీటిని కాల్వల ద్వారా ఎత్తి పోసి రాష్ట్రంలో తొలి జలయజ్ఞం ప్రాజెక్టు పూర్తి చేశామని ప్రకటించారు. వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఆయకట్టుకు నీరు వచ్చిన పరిస్థితులు లేవు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలలోని 24 వేల 800 ఎకరాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్న అధికారులు...ఆయకట్టు పరిధిలో చెరువుల ద్వారా సాగవుతున్న పంటల వివరాలు మాత్రమే చూపిస్తున్నారు.

  • రూ.14 కోట్లతో కాల్వల మరమ్మత్తులకు ప్రతిపాదనలు

వెలిగల్లు ప్రాజెక్టు కింద అసంపూర్తిగా ఉన్న ఉప కాల్వల నిర్మాణాలతో పాటు సిమెంట్ గ్రావిటీ ఏర్పాటుకు రూ .14 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ నిధులు విడుదలై పనులు పూర్తిచేస్తే....వర్షాకాలంలో ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. హంద్రీ నీవా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి నీటిని తరలించేందుకు ఉపకాల్వను అనుసంధానం చేసినా.. ఇప్పటికి చుక్కనీరు రాలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెలిగల్లు కాల్వల మరమ్మతులతో పాటు ఉప కాల్వలను నిర్మించాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు.


ఇదీ చదవండి :'ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం'

ABOUT THE AUTHOR

...view details