ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Viveka Murder Case: శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు - శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కడప కోర్టు వార్తలు

శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కడప కోర్టు
శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కడప కోర్టు

By

Published : Mar 2, 2022, 5:24 PM IST

Updated : Mar 3, 2022, 7:10 AM IST

17:22 March 02

సీబీఐ వాదనలతో ఏకీభవించిన కడప కోర్టు

YS Viveka Case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిలు దరఖాస్తును కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి తిరస్కరించారు. వివేకా హత్య కుట్ర, ఆధారాల ధ్వంసంలో శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని పేర్కొంటూ గతేడాది నవంబరు 17న సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారు. కానీ, సాక్షులను శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదన వినిపించడంతో, దాంతో ఏకీభవించిన న్యాయమూర్తి... బెయిలును తిరస్కరించారు.

అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి (ఫిర్యాదుదారు)లతో పాటు మరో కీలక సాక్షి కల్లూరు గంగాధర్‌రెడ్డి కూడా శివశంకర్‌రెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యారన్న అనుమానం తమకు ఉందని కోర్టుకు సీబీఐ వివరించింది. తమ దర్యాప్తులో శివశంకర్‌రెడ్డి ప్రమేయంపై తాము గుర్తించిన అంశాల్ని న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. శివశంకర్‌రెడ్డి రాజకీయ నేపథ్యం కలిగిన ప్రభావవంతమైన వ్యక్తని, పోలీసు రికార్డుల్లో అతనిపై 31 క్రిమినల్‌ కేసులున్నాయని, అతని నేరచరితకు ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వివిధ వ్యక్తులను శివశంకర్‌రెడ్డి ఎలా ప్రభావితం చేశారో సీబీఐ వివరించింది.

తొలుత వాంగ్మూలం ఇవ్వటానికి సిద్ధమై... తర్వాత సీబీఐపైనే ఫిర్యాదు..

‘వివేకా హత్య నేరాన్ని నాపై వేసుకుంటే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేశాడు’ అంటూ అతని(దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరుల అనుచరుడు) అనుచరుడైన కల్లూరు గంగాధర్‌రెడ్డి గతేడాది అక్టోబరు 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అదే వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చేందుకు 2021 నవంబరు 25న అంగీకరించారు. నవంబరు 27న అతని వాంగ్మూలం నమోదు కోసం న్యాయస్థానంలో సీబీఐ తరఫున దరఖాస్తు చేశాం. అయితే నవంబరు 29న ఆయన మాట మార్చారు. శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ తనను బలవంతం చేసిందని, ఒత్తిడి తెచ్చిందని మీడియా ముందు ఆరోపించారు. అదే అంశంపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్యకు పంపారు. ఈ వ్యవహారంలో చైతన్య తనను వేధిస్తున్నారంటూ.. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న జగదీశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి 2021 నవంబరు 4న సీబీఐ దర్యాప్తు అధికారికి ఫిర్యాదు చేశారు.

వాంగ్మూలం ఇస్తానని చెప్పి.. ముందుకు రాలేదు..

వివేకా హత్య జరిగిన సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. తర్వాత ఈ కేసులో ఆయనకు తెలిసిన విషయాలతో 2021 సెప్టెంబరు 28న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం నమోదు కోసం 2021 సెప్టెంబరు 30న న్యాయస్థానంలో సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అయితే తన సర్వీసు మేటర్‌ వ్యవహారంలో కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలవాల్సి ఉందని, తాను బిజీగా ఉన్నానంటూ మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు శంకరయ్య నిరాకరించారు. తర్వాత వారం రోజుల్లోనే.. అంటే 2021 అక్టోబరు 6న ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తేసింది.

శివశంకర్‌రెడ్డి, అతని సన్నిహితులు చెప్పబట్టే సీబీఐపై ఫిర్యాదు: వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి

వివేకా మృతిపై తొలుత ఎంవీ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పులివెందుల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అయితే సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ తనను ఒత్తిడి చేసి, తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ 2021 డిసెంబరు 13న ఆయన కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు చెప్పబట్టే ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు అనుమానం ఉంది.

బంధువు అంత్యక్రియల కోసమని జైలు నుంచి వెళ్లి.. సీబీఐ అధికారిపై కోర్టులో పిటిషన్‌

దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు. వివేకా హత్యకేసులో ఇతని పాత్ర అనుమానాస్పదంగా ఉంది. వివేకా హత్య వెలుగుచూసిన రోజు (15.03.2019) ఉదయం 5.45 సమయంలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. శివశంకర్‌రెడ్డి, మరికొందరితో కలిసి వివేకా ఇంటికి వెళ్లారు. వైద్యులను పిలిపించి వివేకా గాయాలు కనబడకుండా కట్లు వేయించే ఏర్పాట్లలో బిజీగా గడిపారు. దీంతో సీబీఐ అతన్ని విచారించింది.

  • ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి... అతని బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు ప్రత్యేక అనుమతిచ్చింది. జైలు నుంచి ఆయన ఆ రోజు బయటకు వచ్చారు. అదే రోజు.. అంటే ఫిబ్రవరి 9న ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ అధికారులపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు తనను వేధించారని ఆ పిటిషన్‌లో తప్పుడు ఆరోపణ చేశారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు, దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పిటిషన్‌ వేయించినట్లు అనుమానం ఉంది. తద్వారా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర సన్నిహితులైన అనుచరులతో కలిసి దర్యాప్తును ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే తప్పుడు ఆరోపణలతో పిటిషన్‌ వేయించారు.

భారీ కుట్ర వెలికితీత, ఘటనా స్థలంలోని ఆధారాల ధ్వంసంపై దర్యాప్తు

  • వివేకా హత్య వెనుక ఉన్న ఉన్న భారీ కుట్ర, ఘటనా స్థలంలోని ఆధారాల ధ్వంసంపై దర్యాప్తు చేస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే అది దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. ఆధారాల ధ్వంసంతో పాటు వివేకా హత్యకు కుట్రలో ఆయన పాత్ర ఉంది. ఆయన ప్రభావవంతమైన వ్యక్తి. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే ఆయన పరారయ్యే అవకాశం ఉంది.
  • ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో కొందరు సాక్షులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతున్నారు. కొత్త పేర్లు తెరపైకి తెస్తున్నారు. కుట్రపై దర్యాప్తు కీలకదశలో ఉన్నందున... బెయిలు ఇస్తే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉంది.
  • గతంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మూడు సిట్‌లు ఏర్పాటుచేశారు. 11 నెలల పాటు దర్యాప్తు చేసినా అసలైన దోషుల్ని గుర్తించలేదు. కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయి.
  • తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాక శివశంకర్‌రెడ్డి ఒకరోజు పిలిచి బెదిరించాడని, ఆధారాలు ధ్వంసం చేసి విషయం బయటపెడితే ప్రాణాలకే ముప్పు ఉంటుందని హెచ్చరించాడని ఆర్‌.వి.రమణ అనే వ్యక్తి సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

నెల ముందే కుట్ర

వివేకా హత్యకు నెల రోజుల ముందే (2019 ఫిబ్రవరి 10న) అందుకు పథకరచన, కుట్ర జరిగింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో ఈ కుట్ర సిద్ధమైంది. సీనియర్‌ రాజకీయ నాయకులు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. ఈ కేసులో శివశంకర్‌రెడ్డితో పాటు మరికొందరు సీనియర్‌ నాయకులకు ప్రమేయం ఉందని, వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి తమకు రూ.40 కోట్లు ఇస్తారంటూ ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో తెలిపారు.

"అవినాష్‌రెడ్డి చిన్నాన్న, భాస్కర్‌రెడ్డి సోదరుడైన వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి భార్య పరిమళ పులివెందుల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఆమెను వివేకా వ్యతిరేకించారు. తర్వాత వివేకాకు, మనోహర్‌రెడ్డికి మధ్య భేదాభిప్రాయాలు పెరిగాయి. మూలి కిరణ్‌రెడ్డి అనే ఓ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన భూ వివాదంలో భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి వద్దన్నా వినకుండా వివేకా జోక్యం చేసుకున్నారు. దీంతో వీరిమధ్య విభేదాలు మరింత ముదిరాయి." -వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి

ఇదీ చదవండి

ys viveka murder case : 'వారిద్దరూ అంటే సీఎం జగన్​కు ఆప్యాయత'

Last Updated : Mar 3, 2022, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details