Kadapa Development Meeting By Jana Chaitanya Vedika : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపపై ఐదేళ్లుగా ఎలాంటి దృష్టి సారించక పోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ లో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజాసంఘాలు మేధావులు హాజరయ్యారు.
రైతులకు మద్దతు.. జిల్లాలో ప్రజాసంఘాలు, విపక్షాల నిరసనలు
రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెట్టుబడులు తెలంగాణకి వెళ్లి పోతున్నాయని... ఏపీలో కంటే తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్నాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కు నాలుగు సార్లు శంకు స్థాపన జరుగుతున్న అడుగు ముందుకు పడడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరో వారి శాఖలు ఏంటో ప్రజలకు తెలియడం లేదన్న లక్ష్మణ్ రెడ్డి... పాలకులు వ్యాపారస్తులయితే ప్రజలు బిక్షగాళ్లు గా మారుతారని గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప రిమ్స్ వద్ద ఐటీ హబ్ కోసం భూములు కేటాయిస్తే వాటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు దోచి పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య విమర్శించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి నిరోధకలుగా మారిందో చర్చించడానికి తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.