ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కక్ష వీడి..చెంతకు చేరి! - కడపజిల్లా జమ్మలమడుగు

వాళ్లది ఏళ్ల నాటి వైరం...ఇరువురిది ఫ్యాక్షన్ నేపథ్యం...2 కుటుంబాల్లోనూ ఆప్తులను పొగొట్టుకున్న వైనం...ఒకే పార్టీ గొడుగు కింద ఉన్నా...ఐదేళ్లుగా ఎడమెుహం పెడమెుహంగానే ఉన్నారు. ఇప్పుడు సీన్ మారింది. ఒకరి గెలుపునకు ఒకరు పని చేస్తామంటూ చేతులు కలిపారు. వారే కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.

jammalamadugu

By

Published : Feb 21, 2019, 2:07 PM IST

వైరం వీడిన జమ్మలమడుగు తెదేపా నేతలు

తరాల నుంచి అవే గొడవలు...ఒకరి ఓటమి కోసం ఒకరు ఎంతకైనా తెగించే పంతాలు...అలాఉప్పు నిప్పులా ఉండే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఒకటయ్యారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే...వైరాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు. కలిసి కట్టుగా సైకిల్‌పై సవారీ చేసేందుకు ప్రచారం చేస్తున్నారు.

ఏళ్లనాటివైరం...

కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. దశాబ్దాల ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నియోజకవర్గం. అక్కడ పొన్నపురెడ్డి శివారెడ్డి, దేవగుడి కుటుంబాల మధ్య వైరం ఈనాటిది కాదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పొన్నపురెడ్డి శివారెడ్డి పార్టీలోనే ఉన్నారు. శివారెడ్డి హత్య తర్వాత మాజీమంత్రి రామసుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. దేవగుడి కుటుంబంలో మంత్రి ఆదినారాయణరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
పంతం వీడి..పార్టీ కోసం

2014 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణరెడ్డి గెలిచారు. తర్వాత తెదేపాలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఒకే పార్టీలో ఉన్నా... భగభగలు కొనసాగేవి. రాబోయే ఎన్నికల్లో ఇద్దరు నేతలు జమ్మలమడుగు టికెట్ ఆశించారు. ఈ వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. పలు దఫాల చర్చలతో వివాదం సద్దుమణిగింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, కడప పార్లమెంటు అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగింది.
ఇప్పుడు ఇద్దరు నేతలు నియోజకవర్గంలో కలిసి తిరుగుతున్నారు. ఒకరి గెలుపు కోసం మరొకరు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుచర వర్గాలూ కలిసి పనిచేయాలనే సందేశాన్నిస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి భావోద్వేగమైన ప్రసంగాలు చేస్తున్నారు. తాను కడప ఎంపీగా గెలిచినా, ఓడినా సరే.... జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డిని మాత్రం గెలిపిస్తానని ప్రతిన బూనారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి మాటలతో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం వచ్చింది. మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా గెలిపించాలని రామసుబ్బారెడ్డి తన వర్గీయులకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details