central minister on annamayya dam: ఇటీవల వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య డ్యాంకు ఒకేసారి స్పిల్‌వే సామర్థ్యానికి మించిన వరద రావడంతో అది విరిగిపోయి విపత్తు సంభవించిందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో డ్యాంసేఫ్టీ బిల్లు చర్చకు సమాధానమిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందే సమయానికి దేశంలో 41 డ్యాంలు తెగిపోయాయని, రాజ్యసభలో ఆమోదించేసరికి ఆ సంఖ్య 42కి చేరిందని గుర్తు చేశారు.
gajendra singh shekhawat on annamayya dam: ‘అన్నమయ్య డ్యాంకు ఒకేసారి దాని స్పిల్‌వే సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చాయి. అందుకే స్పిల్‌వే విరిగిపోయింది. స్పిల్‌వే, గేట్లు తెరిచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఒక గేటు తెరుచుకోలేదు. దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్రానికి దాని బాధ్యత లేదా? ఈ డ్యాం గురించి అంతర్జాతీయంగా అధ్యయనం మొదలుపెడితే అది మనకు సిగ్గుచేటు. డ్యాం తెగిపోవడానికి సభలో కూర్చున్న సభ్యులంతా బాధ్యత వహించాల్సిందే. డ్యాం సేఫ్టీ బిల్లు ద్వారా ఏర్పాటు చేస్తున్న జాతీయ డ్యాం సురక్ష ప్రాధికార సంస్థకు జరిమానాలు వేసే అధికారం ఉంటుంది. డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో ఆంధ్రప్రదేశ్ డ్యాంలను డ్రిప్‌లో చేర్చలేదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే కొలమానాలను ఆంధ్రప్రదేశ్ చేరుకోలేదు. చేరుకుంటే మీరు సూచించిన డ్యాంలనూ ఇందులో చేరుస్తామని సభాముఖంగా చెబుతున్నా’ అని పేర్కొన్నారు.