ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల 5వ తేదీన '‘జగనన్న విద్యాకానుక’'ను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి చేరింది. మరికొంత రావాల్సి ఉంది. సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ఆయా మండలాల ఎమ్మార్సీ, ఎంఈవో కార్యాలయాలకు చేర్చారు. వచ్చిన సామగ్రిని పాఠశాల వారీగా సీఆర్పీలు సిద్ధం చేసి పాఠశాలలకు పంపించారు.
ఒక్కో విద్యార్థికి 3 జతల చొప్పున ఏకరూప దుస్తులతోపాటు కొవిడ్-19 నేపథ్యంలో మూడేసి చొప్పున మాస్కులు అందించనున్నారు. ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, 1-10వ తరగతి బాలలు, 1-5 తరగతి వరకు విద్యనభ్యసించే బాలికలకు బెల్టులు ఇస్తారు. వీటితోపాటు 1-3వ తరగతి పిల్లలకు చిన్న సంచులు, 4-7 తరగతి విద్యార్థులకు మధ్య రకం, 8-10వ తరగతి విద్యార్థులకు పెద్ద సంచులు ఇవ్వనున్నారు.