కడప జిల్లాలో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కడప నగరంలోని జయనగర్ కాలనీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో పంపిణీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రులు, శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు నవంబరులో పాఠశాలలు తెరిచే సమయానికి ఏకరూప దుస్తులు కుట్టించుకునేందుకు వీలుగా ముందుగా వస్త్రాలను అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
పంపిణీకి కసరత్తు
జిల్లాలో 2,63,717 మంది విద్యార్థులు జగనన్న విద్యాకానుక కిట్లను అందుకోనున్నారు. 2019-20 విద్యాసంవత్సరం తరగతుల వారీగా అన్‌ఎయిడెడ్, ప్రైవేట్ మినహా ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం తరగతుల వారీగా లెక్కగట్టి కిట్లు పంపిణీ చేయనున్నారు. గతేడాది కన్నా 20 శాతం ప్రవేశాల సంఖ్యను ఎక్కువగా నమోదు చేసి ఆయా పాఠశాలలు, మండలాలు, జిల్లా కేంద్రానికి కిట్లు సరఫరా చేశారు. దాని ప్రకారం విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో కిట్లను అందజేసేవిధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. విద్యార్థుల సంఖ్య దానికన్నా పెరిగినా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి తెప్పించుకునేవిధంగా కసరత్తు చేస్తున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులను అందించేందుకూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రోజుకు 50 మంది విద్యార్థులకు మించకుండా కరోనా నిబంధనల మేరకు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ విషయమై సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తామన్నారు. ఇప్పటికే పాఠశాలలకు కిట్లు చేరాయని, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని వివరించారు.