Jagananna Suraksha Program: ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమంటూ.. నేటి నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం సొంత జిల్లాలోనే.. నిరసన సెగ తగిలింది. వైఎస్సార్ జిల్లా సోమిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని నరసన్నపల్లెలో.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ప్రజలు నిలదీశారు. మహిళలు తాగునీటి సమస్యపై ప్రశ్నించారు. అదే విధంగా రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ కోరారు.
సహనం కోల్పోయిన ఎమ్మెల్యే:వివిధ సమస్యలపై ప్రజలంతా ఏకరవు పెట్టడంతో ఓ దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. వ్యక్తిని తోసివేసుకుని ముందుకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి బసవాపురం వెళ్లగా.. పోలేరమ్మనగర్ వాసులు తాగునీటి సమస్యపై ప్రశ్నించారు. సమస్య తీరుస్తామంటూ ఎంపీపీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఎప్పటికి సమస్య తీరుతుందని మహిళలు ప్రశ్నించారు. పట్టాలిచ్చారుగానీ..పొలాలు చూపించలేదంటూ.. మరికొందరు మహిళలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న మహిళలు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని, వైసీపీ నాయకులను మహిళలు అడ్డుకున్నారు.దీంతో వాహనం దిగకుండానే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మరో గ్రామానికి వెళ్లిపోయారు.
మహిళలు నిలదీత: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, వైసీపీ నేతలను.. మహిళలు నిలదీశారు. తాగునీరు రావడం లేదన్నారు. గడపగడకూ కార్యక్రమంలో మొరపెట్టుకన్నా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు తెప్పించడం లేదని మండిపడ్డారు.
సమస్యను పరిష్కరించండంటూ కన్నీరు పెట్టుకున్న మహిళ : కర్నూలులోనూ.. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలు సమస్యలు ఏకరవుపెట్టారు. కర్నూలులోని 47వ డివిజన్‌లో పింఛన్లు రావడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలో వినూత్న నిరసన: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. రోడ్ విస్తరణలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ.. ఇంటింటికీ పోస్టర్లు అంటించారు. రాత్రికి రాత్రే గ్రామంలోని ఇళ్లకు పోస్టర్లు అంటించారు. నిరసన పోస్టర్లు గ్రామంలో ప్రధాన రహదారి వెంట ఇళ్లకు దర్శనమిస్తున్నాయి. జగనన్న సురక్షలో మీరు మాకు చేయాల్సిన న్యాయం ఇదేనంటూ.. గ్రామస్థులు వేడుకుంటున్నారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటూ కోరుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని.. అధికారులు, నేతలు స్పందించాలని వేడుకుంటున్నారు.
జగనన్న సురక్షలో అడుగడుగునా సమస్యలపై నిలదీత