Jagananna Colony Problems: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం రాజీవ్‌కాలనీ సమీపంలోని గుట్టపై జగనన్న కాలనీ కోసం లేఔట్ వేసి పేదలకు పట్టాలిచ్చారు. తొలుత ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చినా.. ఆ తర్వాత లబ్ధిదారులే కట్టుకోవాలంటూ చేతులెత్తిసింది. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటూ వాలంటీర్లు ఒత్తిడి తీసుకురావడంతో...అప్పులు చేసి మరీ ఇళ్లు సగం మేర ఇళ్లు నిర్మించారు.
గుట్టపైకి సరైన రహదారులు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. గుట్టపైకి నిర్మాణ సామగ్రి తీసుకురావడానికి వాహనాలేవీ రావడం లేదని వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి మరింత అధ్వానంగా తయారైంది. పనులు చేసేందుకు మేస్త్రీలు, కూలీలు ముందుకు రాకపోవడంతో 4 రోజులుగా పనులు నిలిపివేశారు. గుట్టపైకి వెళ్లేందుకు దారి సరిగా లేకపోవడంతో....ఇసుక, నీటికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకకు 2 వేల500, ట్యాంకర్ నీటికి 1500 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఊరికి దూరంగా ఉన్న ఈ కాలనీకి రావాలంటే ఆటోలకి రెండింతల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందన్నారు.