కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్ద దండ్లూరు గ్రామాల మధ్య 3,248.68 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టనున్నారు. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు సున్నపురాళ్లపల్లె వద్ద 88.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు. మొత్తం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి తాజా లెక్కల ప్రకారం 20,098.56 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భారీ నిర్మాణం కోసం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 11న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పెద్ద దండ్లూరు , సున్నపురాళ్లపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను, సమస్యలను అధికారుల ముందు ఉంచారు.
ప్రజల సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని హామీఇచ్చారు. సీఎస్ఆర్ నిధుల కింద ఆ రెండు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రతినిధులు తీసుకుంటారని జిల్లా ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని స్థానికులు కోరారు. అలా చేస్తే కర్మాగారం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు.