యాజమాన్యం కోటలో డీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల మంది విద్యార్థులు జగన్ ప్రభుత్వానికి సమాధి కడతారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న హెచ్చరించారు. డీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... కడప కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు అనుమతి లేదని చెప్పినా.. సంఘం నాయకులు వినలేదు.
ఒక్కసారిగా కలెక్టరేట్లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ద్వారాలు మూసేశారు. విద్యార్థి నాయకులు గేట్లు దూకి కలెక్టరేట్‌లోకి వెళ్లారు. ఇరు వర్గాలకు తోపులాట జరిగింది. యాజమాన్య కోటా కింద లక్ష రూపాయలు వెచ్చించి డీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులను ఇప్పుడు పరీక్షలకు అనుమతించకపోవడం దారుణమని నేతలు ఖండించారు. పరీక్షలకు అనుమతించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.