INTERSTATE ROBBERS AEERST: యూ ట్యూబ్‌లో చూసి కడప ఎన్టీఆర్ కూడలి వద్ద ఓ షాపు షట్టర్‌ను పగులగొట్టిన కెమెరాలను దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కెమెరాలను వారు చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. వారి నుంచి 18 కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, కొన్ని విలువైన కెమెరా లెన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాజస్థాన్‌కు చెందిన కమలేష్ కుమార్, ప్రవీణ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అరెస్టయిన ఇద్దరు నిందితులను వైయస్సార్ జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్.. మీడియా ఎదుట హాజరుపరిచారు.
పోలీసుల సమాచారం ప్రకారం..: రాజస్థాన్‌కు చెందిన కమలేష్ కుమార్, ప్రవీణ్‌కుమార్ ఇద్దరు కడప వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కమలేష్ కుమార్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిపై అతడికి ఆసక్తి ఉండేది. ఖరీదైన కెమెరాలు కొనలేక ఆ వృత్తిని వదిలేసి కడపలో ఒక ఐరన్ దుకాణంలో పనిచేసేవాడు. కడప ఎన్టీఆర్ కూడలి వద్ద స్మార్ట్ కెమెరాల దుకాణంలో ఉన్న కెమెరాలు చూసి ఎలాగైనా వాటిని ఎలాగైనా దొంగలించాలని పథకం వేశాడు.
తనతో పాటు ప్రవీణ్ కుమార్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దొంగతనం ఎలా చేయాలో తెలియక యూట్యూబ్‌లో సెర్చ్ చేసి షట్టర్‌ను పగులగొట్టే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఈ నెల 16వ తేదీన వీరిద్దరూ కలిసి ఇనుప కడ్డీతో కెమెరా దుకాణం షెట్టర్‌ను పగలగొట్టి దుకాణంలోకి వెళ్ళి చోరీకి పాల్పడ్డారు. అక్కడ ఉన్న 18 కెమెరాలు, రెండు జోన్ కెమెరాలు, మూడు ఖరీదైన లెన్సులు మొత్తం ఎనిమిది లక్షలు విలువ చేసే సామాగ్రిని దొంగలించి అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రాజస్థాన్‌కు పారిపోయారు.