Interstate Robbers Arrested : కడప జిల్లా పోలీసులు రెండు వేరు వేరు ప్రాంతాలలో అంతర్రాష్ట్ర దొంగలను, ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువచేసే వజ్రాలను, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. వజ్రాలను స్వాధీనం చేసుకున్న కేసు దాదాపు రెండు సంవత్సరాల క్రితం నమోదయ్యిందని.. ఆ నిందితుడు గోవాలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
అమ్మి పెట్టమన్నందుకు ఎత్తుకెళ్లారు : కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో వజ్రాల దొంగతనం జరిగింది. ఈ కేసులో ప్రధాన సుత్రధారుడ్ని అరెస్టు చేసి అతని నుంచి 53 లక్షల రూపాయల విలువ చేసే మూడు చిన్న వజ్రాలను, ఒక కనక పుష్యరాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని అల్మాస్ పేటకు చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి, గోవాకు చెందిన ఇస్మాయిల్ షాహిద్ అనే వజ్రాల వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. తన దగ్గర 9 వజ్రాలు ఉన్నాయని వాటిని విక్రయించి నగదు ఇవ్వాలని.. కడపకు చెందిన ఖాదర్ బాషా.. వజ్రాల వ్యాపారిని కోరాడు.
వజ్రాలను తీసుకుని వచ్చి నేరుగా చూపిస్తే విక్రయించి నగదు చెల్లిస్తానని వజ్రాల వ్యాపారి తెలిపాడు. ఈ క్రమంలో 2020 జనవరి 16వ తేదీన కడపకు చెందిన ఖాదర్ బాషా తన వద్ద ఉన్న వజ్రాలను తీసుకుని.. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీకి వెళ్లాడు. అక్కడికి ఇస్మాయిల్ షాహిద్ మరి కొంతమంది వజ్రాల వ్యాపారులను తీసుకుని వచ్చాడు. ఖాదర్ బాషా తన వద్ద ఉన్న వజ్రాలను చూపిస్తున్న క్రమంలో ఇస్మాయిల్ షాహిద్ తన అనుచరులతో కలిసి బాషాపై దాడి చేశాడు.