Cyber Crime With Fake Fingerprints : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. వారు రోజుకొక పద్దతిలో అమాయకుల దగ్గర నుంచి వారికే తెలియకుండా బురుడి కొట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వైయస్‌ఆర్ జిల్లా పోలీసులకు చిక్కారు. పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు.
ఆధార్ ఎనేబుల్ సిస్టం: వైయస్‌ఆర్ జిల్లా కడప ఫక్కీర్‌పల్లెకు చెందిన సనాపు రాజశేఖర్‌రెడ్డికి కెనరా, యూనియన్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. 2022 జులై 21 నుంచి 29వ తేదీ వరకు అతనికి తెలియకుండా ఎలాంటి ఓటీపీలు, లింక్‌లు రాకుండానే రూ.89,550 నగదు డ్రా అయ్యింది. బాధితుడు కడప చిన్నచౌకు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడానికి ఏఎస్పీ తుషార్ డూడిని నియమించాం. ఆధార్ ఎనేబుల్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా బాధితుని నకిలీ వేలిముద్రలను సృష్టించి కస్టమర్ సర్వీస్ పాయింట్‌లోని బయోమెట్రిక్ డివైస్ స్కానర్‌లో ఖాతాదారుని ఆధార్‌కార్డుకు లింకు ఉన్న బ్యాంకు ఖాతా నుంచి రోజుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.89,550 నగదును డ్రా చేశారు. ఏఈపీఎస్ ద్వారానే సైబర్ నేరానికి పాల్పడినట్లు తెలుసుకున్నాం.