చలో పులివెందుల పేరుతో అనంతపురం జిల్లా కదిరి నుంచి బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అడగడుగునా అడ్డుకున్నారు. పులివెందులలో ఎస్సీ మహిళా హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పార్టీ ఎస్సీ సెల్ నేతలు చలో పులివెందుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిరి నియోజకవర్గం నుంచి తెదేపా శ్రేణులు భారీగా బయల్దేరాయి. వీరి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు... తలుపుల మండలం బండమీదపల్లి కొత్తపల్లి నుంచి వివిధ ప్రాంతాల్లో వీరిని అడ్డుకునేందుకు యత్నించారు.
పోలీసుల తీరుపై నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలపై దాడులను ఆరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వీటిపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెదేపా నేత రాజశేఖర్ బాబు అన్నారు.