తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు సంబంధం ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 20 లక్షలతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జనవరిలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా పరిధిలోని ఈశ్వర్రెడ్డి నగర్లో చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా కచ్చితమైన సమాచారంతో తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనంపై జమ్మలమడుగు నుంచి కర్నూలుకు వెళుతున్న సద్దాం హుస్సేన్, మహబూబ్ బాషా, అబ్బాస్ లను విచారించగా వారు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. చోరీ సొత్తును అనంతపురానికి చెందిన జొన్నగడ్డ పుల్లా నాయుడు ద్వారా అమ్ముతున్నట్లు చెప్పారు.