నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టి, బట్టీ చదువులు చదవడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి తగ్గిపోతోంది. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. వాటిని నియంత్రించి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) సంయుక్తంగా సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మానక్లు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ... విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే మరిన్నీ ఆవిష్కరణలు వెలుగు చూస్తాయంటున్నారు ఉపాధ్యాయులు.
కడప జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి దాదాపుగా రెండు వేలకు పైగా అప్లికేషన్లు రాగా అందులో 483 నమూనాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఎంపికైన ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయలను ఎన్ఐఎఫ్ నగదు ప్రోత్సాహకం అందిస్తుందని ఆ సంస్థ ప్రాంతీయ అధికారి వెంకటక్రిష్ణా రెడ్డి తెలిపారు.