మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(ys viveka) హత్యకేసులో సీబీఐ నాలుగో దఫా విచారణ ముమ్మరంగా సాగుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరుసగా 5 రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ... కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వివేకా ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లోకి దస్తగిరిని తీసుకెళ్లి పరిశీలించారు. హత్య జరిగిన రోజు దుండగులు అక్కడేమైనా నక్కి ఉన్నారా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. దస్తగిరితో కలిపి పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను కడపలో 8 గంటల పాటు విచారణ చేశారు. ఇక సీబీఐ అధికారులు అడిగిన మేరకు... రవాణా శాఖ సిబ్బంది కొన్ని వాహనాల వివరాలను సీబీఐకి అందజేశారు.
2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్య(ys viveka murder) జరిగింది. 14వ తేదీ అర్ధరాత్రి వివేకా ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన అనుమానాస్పద వాహనాల వివరాలను రవాణ శాఖ అందించడంతో... శుక్రవారం మధ్యాహ్నం రెండు సీబీఐ బృందాలు కడప నుంచి పులివెందుల వెళ్లాయి. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనం తిప్పిన యజమానులు అరికటవేముల రవి అలియాస్ మట్కారవితో పాటు డ్రైవర్ గోవర్ధన్‌ను సీబీఐ(cbi) ప్రశ్నించింది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో ఇద్దరినీ ప్రశ్నించారు. మట్కారవిపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆరోజు ఇన్నోవా వాహనం ఎక్కడెక్కడ వెళ్లిందనే వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. ఎపుడు విచారణకు పిలిచినా రావాలని మట్కారవి, గోవర్ధన్‌లను అధికారులు ఆదేశించారు.