Indigo has Stopped Flights to Kadapa:ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కడప నుంచి సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఒప్పందం మేరకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో.. కడపకు ఉన్న విమానయాన సర్వీసులను ఆపేస్తామంటూ.. ఇండిగో సంస్థ టికెట్ల జారీని ఆపేసింది. గతంలో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండిగో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద.. రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో సంస్థకు ఏటా 20 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంది. కడపకు గతంలో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ.. ఆ తర్వాత సర్వీసులు నిలిపివేసింది. ఆ కారణంగా ఆరు నెలలకు పైగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి.
Chandrababu Letter to Jagan:ఈ సమస్యపై 2021 అక్టోబరు 11న సీఎం జగన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అందరికీ విమానయానం అందుబాటులో ఉండాలనే.. టీడీపీ హయాంలో ఉడాన్ పథకం కింద టైర్-2, 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు, కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరుకు నేరుగా విమానాలు నడిచాయని లేఖలో ప్రస్తావించారు.ఇండిగో సంస్థతో చర్చలుజరిపి ఒప్పందం చేసుకోగా.. 2022 మార్చి 27 నుంచి విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు విమానాలను నడిపింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీజీఎఫ్ చెల్లించకపోవడంతో.. అనేక సార్లు ఇండిగో సంస్థ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సెప్టెంబరు 1 నుంచి కడపకు విమాన సర్వీసుల్ని ఆపేయాలని నిర్ణయం తీసుకుని, ఆన్‌లైన్‌లో టికెట్ల జారీని నిలిపివేసింది.