Funding problem for Gram Panchayats: రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలోని అనేక గ్రామాల పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి. వచ్చిన ఆర్థిక సంఘం నిధులను మొత్తం విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేయడంతో గ్రామపంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ప్రోత్సా హక నిధులతో కొన్ని ముఖ్యమైన పనులైనా చేయిద్దామని ఆశపడిన సర్పంచులు.. ఖాతాల్లో నిధులు కనిపించక ఆందోళన చెందుతున్నారు.
తెలిసేలోపే ఖాతాలు ఖాళీ..రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన 2,001 పంచాయతీలకు ప్రభుత్వం ఏడాది క్రితం 134 కోట్ల రూపాయలు ప్రోత్సాహక నిధులు విడుదల చేసింది. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షలు, 2,001 నుంచి 5,000 లోపు ఉన్న వాటికి 10 లక్షలు, 5,001-10,000 లోపు వాటికి 15 లక్షలు, 10,000కు మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. వాటిని సాధారణ నిధుల ఖాతాకు జమచేసినట్లు అధికారులు ప్రకటించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం పంచాయతీల పేరుతో ఉన్న ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాల్లో వేశారు. తర్వాత వాటిని విద్యుత్ బకాయిలు కింద సర్దుబాటు చేశారు. వైఎస్సార్ జిల్లాతో పాటు.. అన్నమయ్య జిల్లాల్లో 120కి పైగా పంచాయతీల్లో సర్పంచులకు ప్రోత్సాహక నిధులు వచ్చాయి అనే విషయం తెలిసేలోపే పీడీ ఖాతాలు ఖాళీ అయ్యాయి.