Illigal Fishing in Somasila : సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే జలాశయ వెనక జలాలు మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 22 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న.. ఈ జలాల్లో నిషేధిత వలలతో చేపల వేట కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ జాలర్లు నిషేధిత వలలను వినియోగించి చేపల వేట కొనసాగిస్తున్నారు. చిన్న రంధ్రాలు కలిగిన వలలను వినియోగించి.. చిరు చేపలను వేటాడుతున్నారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే ఈ అక్రమ వేట కొనసాగుతోందని సమాచారం.
ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం, పెనగలూరు, సిద్ధవటం మండలాల్లో సోమశిల వెనక జలాలు విస్తరించి ఉన్నాయి. ఈ జలాల్లో చేపలను మత్స్యకారులు వేటాడి విక్రయించుకోవటానికి కొన్ని షరతులతో అనుమతి ఉంది. గాలం, చిలుకు వల, బోటుల ద్వారా చేపలు పట్టుకుంటే సమస్య లేదు. కానీ చిన్న చిన్న రంధ్రాలు కలిగిన వలలను చేపల వేటకు వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈ వలల వల్ల చిరు చేపలు వలలకు చిక్కుతాయి. దీనివల్ల మత్స్య సంపద అంతరించే అవకాశం కలదని.. కొన్ని వలలను వినియోగించటానికి వీలు లేదు.