కడప జిల్లావ్యాప్తంగా 1.10 లక్షల మంది లబ్దిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తూ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. 3వ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మండలంలో పొన్నతోట, పెద్దండ్లురుకు చెందిన 168 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అర్హులందరికీ పట్టాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అనంతపురంలో..
ఇంటి స్థలాల పట్టాల పంపిణీలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 1500 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీలో పలుచోట్ల చంద్రబాబు పేరు వినిపించడం వల్ల కదిరిలో జరిగిన పట్టాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాగ్రత్తపడ్డారు. 'ఇల్లు కట్టించాలని దృఢసంకల్పం జగనన్నది.. పేదోళ్ల కొంపలు కూల్చే ఆలోచన చంద్రబాబుది' అంటూ పలువురు మహిళల చేత నినాదాలు చేయించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఈ తరహా విమర్శలు చేయించడంపై పలువురు పెదవి విరిచారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, తదితరులు హాజరయ్యారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గండేపల్లి, పేరకలపాడు, కేసర, పెండ్యాల, వేములపల్లి, ఎస్. అమరవరం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న కాలనీలకు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 1729 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. మొదటి విడతలో అర్హులకు ఇళ్ల స్థలాలు రాకపోతే రెండో విడత భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ వీరభద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.