కడప జిల్లా బద్వేలులో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ మాసంలో రూ. 54 లక్షలతో చేపట్టిన పనులు మార్చి నాటికే పూర్తి కావాల్సివుంది. మే కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఆసుపత్రికి నిత్యం 300లకు పైగా పేద రోగులు వస్తుంటారు. కనీస సౌకర్యాలు లేకపోవడం.. రోగులకు కష్టాలు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. అరకొర సౌకర్యాలు ఉన్న ప్రసూతి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ప్రసూతి ఆరోగ్య సంరక్షణ కేంద్రం భవనంపై రెండు కోట్ల 80 లక్షలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణం పనులు చేపట్టారు. ఇప్పటికైనా బద్వేలు ఆసుపత్రి భవన నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.