కడప జిల్లా రాజంపేట పురపాలక ఎన్నికలకు మరోసారి బ్రేక్ పడింది. పురపాలికలో వార్డుల విభజన ప్రక్రియను ఇటీవల అధికారులు చేపట్టారు. మొత్తం 20 వార్డులు ఉండగా వాటిని 29గా విభజించారు. ఈ సమయంలో ఒక్కో వార్డుకు ఓట్లను కేటాయించారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ తెదేపాకు చెందిన పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారించిన న్యాయస్థానం ఎన్నికలపై 'స్టే' విధించింది.
మేజర్ పంచాయతీగా ఉన్న రాజంపేటను 2005లో నగర పంచాయతీగా మార్చి తొలిసారిగా పురపాలక ఎన్నికలు నిర్వహించారు. ఆ గడువు 2010తో ముగిసింది. ఈ సమయంలో రాజంపేట చుట్టుపక్కల ఉన్న బోయినపల్లి, తాళ్లపాక, ఎంజీ పురం, పెద్దకారంపల్లి, కూచివారిపల్లి పంచాయతీల విలీనం చేయాలని నాటి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు కోర్టును ఆశ్రయించగా... 2010 నుంచి ఇప్పటి వరకు రాజంపేట పురపాలికకు ఎన్నికలు జరగలేదు. వాటికి తోడు ఇప్పుడు పురపాలక వార్డు విభజనలో అక్రమాలు జరిగాయంటూ తెదేపా నాయకులు కోర్టును ఆశ్రయించటంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పురపాలకల్లో పలు పంచాయతీలు విలీనం చేసే ప్రక్రియ కోర్టులో ఉంది. ఇప్పుడు ఆయా మున్సిపాలిటీల ఎన్నికలను నిలిపివేయాలని పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇది ఎన్నికల నిర్వహణకు మరో ఆటంకంగా మారింది.