High Court Serious on Lavanna: కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్న రెండు వారాల్లో తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. వృద్ధురాలు పద్మావతి బాయి ఇంటి కూల్చివేతపై హైకోర్టు స్టే విధించినప్పటికీ.. అధికారులు కోర్టు ఉత్తర్వులు పాటించకుండా తిరిగి బాధితురాలిపైనే కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కోర్టు ఉత్తర్వులను కొంతమంది అధికారులు గౌరవించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధురాలి ఇంటిని కూల్చివేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
వైఎస్సార్సీపీ నేత ఇంటికి దారి ఇచ్చేందుకు తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ పద్మావతి బాయి గతంలో హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. స్టే ఉత్తర్వులను తీసుకెళ్లి ఇస్తే చించివేసి ఇళ్లు, షాపులు కూల్చేశారని.. పైగా బాధితురాలిపై కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ కోర్టుకు విన్నవించారు. బాధిత వృద్ధురాలిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో నేడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.