ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

brahmamagari matham: ప్రత్యేక కమిషనర్​కు ఆ ప్రొసీడింగ్స్ ఉన్నాయా ?: హైకోర్టు - kurnool latest news

దేవాదాయ కమిషనర్ విధుల్ని ప్రత్యేక కమిషనర్ నిర్వహించే అధికారం కల్పిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయా ? ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మఠాధిపతులుగా తమను విధులు నిర్వహించనీయకుండా దేవాదాయ ప్రత్యేక కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని బ్రహ్మంగారి రెండో భార్య ఎన్.మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్.గోవిందస్వామి వేసిన పిటిషన్​పై ప్రభుత్వం నుంచి కోర్టు వివరణ కోరింది.

high court on brahmamgari matham
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంపై హైకోర్టు

By

Published : Jul 9, 2021, 6:04 AM IST

దేవాదాయ శాఖ కమిషనర్ విధుల్ని ప్రత్యేక కమిషనర్ నిర్వహించేందుకు అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు ఏమైనా జారీచేశారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆ వివరాల్ని తమ ముందు ఉంచాలని దేవాదాయ శాఖ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఈ మేరకు ఆదేశాలిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి తమను మఠాధిపతులుగా గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ ఇటీవల కన్నుమూసిన మఠాధిపతి రెండో భార్య ఎన్.మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్.గోవిందస్వామి (మైనర్) హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మఠాధిపతులుగా తమను విధులు నిర్వహించనీయకుండా ఈ ఏడాది జూన్ 12న దేవాదాయ ప్రత్యేక కమిషనర్, 13వ తేదీన సహాయ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని వారు కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.పిచ్చయ్య వాదనలు వినిపిస్తూ దేవాదాయ చట్టంలోని సెక్షన్ 52ను తప్పుగా అర్థం చేసుకొని అధికారులు ఉత్తర్వులు జారీచేశారన్నారు. మఠాధిపతి పోస్టు తాత్కాలికంగా ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే సెక్షన్ 52 వర్తిస్తుందన్నారు.

'ధార్మిక పరిషత్ సమావేశం కాలేదు'

ప్రస్తుత విషయంలో మఠాధిపతి చనిపోయారని.. అందుకే పోస్టు శాశ్వత ఖాళీ ఏర్పడిందని పేర్కొన్నారు. పూర్వ మఠాధిపతి రాసిన వీలునామా ప్రకారం పిటిషనర్లు మఠాధిపతులుగా నియమితులవ్వాలని వాదించారు. ధార్మిక పరిషత్ ప్రొసీడింగ్ ఆధారంగా దేవాదాయ ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీచేశామని చెప్పినప్పటికీ ధార్మిక పరిషత్ సమావేశం ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అజెండా ఏమిటి? పాల్గొన్న సభ్యులెవరు? తదితర విరాల్ని వెల్లడించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ధార్మిక పరిషత్ సమావేశం కాలేదనేది తమ అనుమానమని తెలిపారు.

'ప్రత్యేక కమిషనర్ పోస్టు లేదు'

దేవాదాయ చట్టంలో ప్రత్యేక కమిషనర్ పోస్టు లేదని కేవలం కమిషనర్, అదనపు కమిషనర్ తదితర పోస్టులున్నాయన్నారు. ఎలాంటి అధికారం లేకుండా ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు ఎలా ఇస్తారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ధార్మిక పరిషత్ తీర్మాన ప్రతుల్ని కోర్టు ముందు ఉంచామన్నారు. ధార్మిక పరిషత్ కమిటీలోని మొత్తం నలుగురు సభ్యుల్లో మెజార్టీ సభ్యులు (ముగ్గురు) తీర్మానంపై సంతకం చేశారని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. దేవాదాయ కమిషనర్ విధుల్ని ప్రత్యేక కమిషనర్ నిర్వహించే అధికారం కల్పిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలన్నారు. అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణ సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

NHAI: 'అనకాపల్లిలో వంతెన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించాం.. కఠినంగా స్పందించాం'

AOB Villagers: 'మమ్మల్ని గుర్తించండి.. దయచేసి ఆంధ్రప్రదేశ్​లో కలిపేయండి'

ABOUT THE AUTHOR

...view details