కడప జిల్లా గుండ్లమడుగు గ్రామంలోని ఏపీఐఐసీకి చెందిన 227 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీని నిలువరిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. గుండ్లమడుగులో ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి చెందిన 227 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 16న జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యవసాయ కూలి జి.అంకల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీఐఐసీకి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్కు లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.నాగేంద్రరెడ్డి వాదించారు. ఈ వ్యాజ్యం దాఖలు చేయడం వెనుక ప్రజాహితం లేదని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.