కడప జిల్లాలో 2019 వరకు 790 పంచాయతీలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గతేడాది ప్రారంభంలో పంచాయతీల విభజన, విలీన ప్రక్రియ చేపట్టింది. జనాభా ప్రాతిపదికన పెద్ద పంచాయతీలను విభజించి రెండు, మూడు పంచాయతీలు చేయడం, చిన్నచిన్న పంచాయతీలను కలిపేయడం వంటి చర్యలు చేపట్టింది. కొన్నిచోట్ల గ్రామస్థులకు ఇష్టం లేకపోయినా ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ లెక్కన జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య గతేడాది ఫిబ్రవరి-మార్చిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం 807కు చేరింది.
కరోనా నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగ లేదు. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో రెండు, మూడు విడతలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై కొందరు స్థానికులు, రాజకీయ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లాలో 13 పంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.
● రైల్వేకోడూరు మండలంలో రెడ్డివారిపల్లె పంచాయతీని విభజించి గుండాలపల్లె పంచాయతీని ఏర్పాటు చేశారు.
● సంబేపల్లి మండలంలోని శెట్టిపల్లె పంచాయతీని విభజించి శెట్టిపల్లి, అడవికాంపల్లి, చదిపిరాళ్లవాండ్లపల్లె పంచాయతీలు చేశారు. ఎస్టీ జనాభా అనుగుణంగా పెద్దబిడికిని మరో పంచాయతీ చేశారు. పెద్దబిడికి మినహా మిగిలిన మూడు పంచాయతీలు కలిసే ఉండాలనే ఉద్దేశంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు.
● కమలాపురం మండలంలోని సి.గోపులాపురం పంచాయతీ ఎన్నికలపై స్టే వచ్చింది. కమలాపురం నగర పంచాయతీ చేసే సమయంలో సి.గోపులాపురం పంచాయతీ పరిధిలోని నీరాపురం గ్రామాన్ని కమలా పురం నగర పంచాయతీలో కలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు.
● వల్లూరు మండలం పెద్దపుత్త, మాచిరెడ్డిపల్లె పంచాయతీల ఎన్నికలకు బ్రేకు పడింది. పెద్దపుత్త నుంచి మాచిరెడ్డిపల్లెను విభజించడంతో కలిసే ఉండాలనే ఉద్దేశాన్ని స్థానికులు కోర్టుకు విన్నవించారు.
●పుల్లంపేట మండలంలోని బావికాడపల్లి, రామాపురం పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇక్కడ కూడా విభజనకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
● నందలూరు మండలం నూకినేనిపల్లి పంచాయతీలో ఎన్నికలు నిలుపుదల చేశారు. గతంలో కుందానెల్లూరు పంచాయతీని నూకినేనిపల్లిలో విలీనం చేయడంతో స్థానికులు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కారు.