కడప జిల్లాలోని పుట్లంపల్లిలో దుర్భర పరిస్థిని నెలకొంది. అక్కడకు వెళ్లాలంటే రాళ్లు తేలిన మట్టిరోడ్డే దిక్కు. ఆ పరిసరాల్లో అత్యధిక పశువులు ఉన్న గ్రామం ఇదే! అక్కడ నివసించే వారు 800 మంది అయితే... పశువులు మాత్రం 900. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. పుట్లంపల్లిలో ఒకప్పుడు అత్యధిక పశువులు ఉండేవట... అని చెప్పుకునే గ్రామం ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తోంది. తాగడానికే నీరు లేని ఆ పల్లెలో పశువుల పోషణ భారమవుతోంది.
కరవు అంచున....
వర్షాభావ పరిస్థితులు పుట్లంపల్లికి శాపంగా మారాయి. ఏడాది నుంచి సరైన వర్షాల్లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీరు లేక చెరువులన్నీ ఎండిపోయాయి. భూములన్నీ దాహంతో నోళ్లు తెరిచాయి. అక్కడి కరవు పరిస్థితి సగటు మనిషికి కన్నీరు తెప్పిస్తోంది. ఒకప్పుడు సంతోషంతో ఉన్న ప్రజలు నేడు... అనుక్షణం ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు.