Heavy Rains in Many Places in AP: రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చెన్నూరు మండలంలో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడప నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అంబేద్కర్ కూడలి, వై జంక్షన్, భరత్ నగర్, ప్రకాష్ నగర్, లోహియా నగర్, గంజికుంట కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మీదుగా ప్రవహించే వక్కిలేదు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రావులపాలెం, కుమ్మర రావులపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంకలో నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో రాకపోకలు సాగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వంక ఉద్ధృతి సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఈ క్రమంలో జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి మండలం తిప్పరాజు పల్లిలో రాత్రి కురిసిన వర్షానికి వంక భారీగా ప్రవహించడంతో ఆ గ్రామస్థులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి కూసిన వర్షానికి తిప్పరాజు పల్లి వంకలో ఆరుగురు చిక్కుకున్నారు. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులను గ్రామస్థులు సురక్షితంగా కాపాడారు. ఈ వంకపై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకులు దృష్టికి దశాబ్ద కాలంగా తీసుకువెళుతున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.