కడప జిల్లాలో నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. గత రాత్రి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చిత్తూరు - నెల్లూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా రైల్వేకోడూరులో 245.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 44.65 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, చెరువులు
మాండవ్య, పెన్నా, పుల్లంగేరు, గుంజన, చెయ్యేరు, పాపాగ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయచోటి మండలంలోని ఇనాత్ ఖాన్ చెరువు, గుండ్ల చెరువులు పొంగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాగులు, వంకల వద్ద నీటిలో దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావానికి జిల్లాలోని చేతికి వచ్చిన వరి పంట నేలకొరగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైదుకూరులో.. బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. నియోజకవర్గంలో విస్తారంగా సాగైన వరి పంట నీటిపాలైంది. చేతికొచ్చిన పంట చేజారిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.