Rains Across the State: గత పది రోజుల నుంచి తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. కడపలో.. ఇవాళ మధ్యాహ్నం భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిపాటి వర్షానికే కడప నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, వై జంక్షన్ కూడలి తదితర ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది.
భారీగా ఈదురు గాలులు వేయడంతో పలుచోట్ల హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొద్దిపాటి వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. మరమ్మతులు చేపడుతున్నారు.
సత్యసాయి జల్లాలో వర్షం:శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. హిందూపురం పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో.. విలవిలలాడిన హిందూపురం వాసులకు.. వర్షం రాకతో ఉపశమనం లభించినట్లు అయింది.