కడప జిల్లాలో భారీ వర్షం... పిడుగుపాటుకు ఒకరు మృతి
కడప జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పుల్లంపేటలో ఓ విద్యార్థిపై పిడుగుపడి అక్కడిక్కక్కడే మృతి చెందగా, సుండుపల్లిలో రెండు ద్విచక్రవాహనాలు కాలిపోయాయి.
కడప జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి కింద పడ్డాయి. నగరంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుండుపల్లెలో పిడుగుపాటుకు రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. ప్రమాదవశాత్తు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పుల్లంపేట మండలం ఎగువ రెడ్డిపల్లికు చెందిన డిగ్రీ విద్యార్థి పావురాలకు గింజలు వేయటానికి వెళ్లి... పిడుగుపాటుతో మృతి చెందాడు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వర్షం పడడం ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఓబులవారిపల్లె మండలంలో గాలి వానకు 300 ఎకరాల అరటి తోటలు నేలమట్టమయ్యాయి. మండలంలో పెద్ద ఓరంపాడు, జి వి పురం, ఓబులవారిపల్లి, చిన్నంపల్లి , ముక్కు వారి పల్లి గ్రామాల్లో పంట పొలాలకు సంబంధించిన అరటి రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 ఎకరాలకు రూ.3 కోట్లు వరకు నష్టం వాటిల్లిందని ఉద్యాన అధికారుల అంచనావేస్తున్నారు.