కడప జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు చిన్నిపాటి వర్షానికే కడప నగరం ముంపునకు గురవుతోంది. అలాంటిది రెండ్రోజులుగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. వర్షపు నీరు, మురుగునీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో.. నీరంతా రహదారులపైనే ప్రవహిస్తోంది. స్థానిక అంబేడ్కర్ కూడలి, అప్సరా సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ బస్టాండు, వివేకానంద నగర్, ప్రకాశ్ నగర్, బాలాజీ నగర్, తారకరామ నగర్, మృత్యుంజయ కుంట, ఎన్జీవో కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
పట్టించుకునే నాధుడే లేడు..
కడపలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బాలాజీ నగర్‌లో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోకాళ్ల లోతు వరకు నీరు..
బాలాజీనగర్‌లో రహదారిపైనే మోకాలి లోతు వరకు వర్షం నీరు నిలిచి ఉంది. వరద నీరు రహదారులపై ప్రవహించడంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరం నడిబొడ్డున ఉండే కాలనీలను పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇలాంటి కష్టాలు ఏంటని పెదవి విరుస్తున్నారు. కడప నగరంలో ప్రతి వీధిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ల మధ్యలోనే నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ముంపు బాధితులు కోరుతున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు కాలనీల్లో జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌లోకి నీరు రావడంతో కార్మికులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముద్దనూరు రోడ్డులోని పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో పత్తి, జొన్న పంటపొలాలలోకి నీరు చేరాయని రైతులు వాపోయారు.
ఇదీ చదవండి:
కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఇంతియాజ్‌కు.. వారెంట్ జారీ