ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో జోరుగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కడప జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

చక్రాయిపేట మండలంలో పొంగి ప్రవాహిస్తున్న వాగు
చక్రాయిపేట మండలంలో పొంగి ప్రవాహిస్తున్న వాగు

By

Published : Oct 11, 2020, 12:43 PM IST

Updated : Oct 11, 2020, 8:06 PM IST

అల్పపీడన ప్రభావం వల్ల కడపలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, అప్సర సర్కిల్, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీ, నకాష్ వీధి, ఫకీర్ పల్లె తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రోడ్లపై మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మైదుకూరులో..
అల్పపీడనం ప్రభావంతో మైదుకూరు ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణ మీదుగా ప్రవహించే ఎర్ర చెరువు అలుగు పారటంతో లోతట్టు ప్రాంతంలోకి నీరు చేరింది.

బద్వేల్​లో...
బద్వేల్​లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై మురుగునీరు, వర్షపునీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో కోన్నిచోట్ల భారీగా వర్షాలు కురిశాయి. కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్ల​లో భారీగా వర్షపాతం నమోదైంది.

చక్రాయిపేటలో..
చక్రాయపేట మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గంగారపు వాండ్లపల్లి, మహాదేవపల్లి-గొట్లమిట్ల, ప్రధాన రహదారిలో గండిన వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కమలాపురంలో...

కమలాపురం మండలం సి. గోపులపురంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలవటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

లింగాలలో...

పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో భారీ వర్షం కురిసింది. వానకు గ్రామానికి చెందిన యాతం చిన్న నారాయణ రెడ్డి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

పొంగుతున్న వాగులు, అలుగు పోస్తున్న చెరువులు...

గాలివీడు మండలం లోని పెద్దచెరువు అలుగు ఉధృతంగా ప్రవహించటంతో మదనపల్లి-గాలివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయు. మద్దిరేవుల వంక ఉధృతితో వేంపల్లి-రాయచోటి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మాండవ్య నది వరద ధాటికి కాజ్​వే కొట్టుకుపోయింది. పించా, పెన్నా, పాపాగ్ని నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

ఇదీ చదవండి

:

గండికోటలో నందమూరి తారకరత్న సందడి

Last Updated : Oct 11, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details