కడప జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఎర్రగుంట్లలో అత్యధికంగా 20.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. వరద ధాటికి వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
చక్రాయపేట మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. దేవరగుట్ట పల్లెలోని వడ్డే వంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెలకంపల్లె వంకకు వరద పొంగిపొర్లుతోంది. పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ప్రజలు ఎవరూ అటుగా వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో కుండపోత కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంటలన్నీ నీట మునగడం వల్ల భారీనష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. జమ్మలమడుగులో పలు ప్రభుత్వ కార్యాలయాలు.. కోర్టు ఆవరణ, డీఎస్పీ బంగ్లా, ఆర్టీసీ బస్టాండ్, ఎంపీడీవో కార్యాలయం నీటమునిగాయి. నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని... రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షానికి బి కోడూరు మండలంలోని అంకనగొడుగు నూరు చెరువుకు గండి పడింది. గుర్తించిన రైతులు... వర్షాన్ని లెక్క చేయకుండా గండిని పూడ్చివేశారు.