కడప జిల్లాలోని పురపాలక, నగరపాలక సంస్థ శివారులోని గ్రామ పంచాయతీల్లో అక్రమంగా, అనుమతి లేని లే-అవుట్లు జోరుగా విస్తరిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఎంచక్కా స్థిరాస్తి వ్యాపారులు పెద్ద ఎత్తున అనుచిత లబ్ధి పొందుతున్నారు. వ్యయసాయేత భూములుగా మార్పిడి, సామాజిక ప్రయోజనాలకు పది శాతం స్థలాలు, అంతర్గత రహదారులను పట్టించుకోవడం లేదు. అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయానికి, ప్రయోజనాలకు రియల్టర్లు ఎసరుపెడుతున్నారు. చట్టంలోని లోసుగులను అనుకూలంగా మలుచుకుంటున్నారు.
చట్టం ఏం చెబుతోంది...
● 2002 మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన 67వ జీవో ప్రకారం అనుమతి లేని లే- అవుట్‌లో కట్టడాలకు నిర్మాణ ఆకృతి నిలిపేత, అభివృద్ధి పనులు చేపట్టవద్దని స్పష్టంగా పేర్కొన్నారు.
తక్కువ శాతం రుసుం...
●పురపాలిక, పంచాయతీలోని శివారు ప్రాంతాల్లో రహదారుల పక్కన వ్యయసాయ భూముల్లో పెద్ద ఎత్తున నివేశన ప్లాట్ల విభజన, అమ్మకాలను స్థిరాస్తి వ్యాపారులు చేపడతున్నారు. సెంటు రూ.2 లక్షల నుంచి ఆపై డిమాండు ఉంటే స్థలానికి ధర అమాంతంగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేని అవుట్ కాలనీల్లో కొనుగోలు చేసిన స్థలాల్లో కట్టడాలకు నిర్మాణ ఆకృతికి ఆమోదం ఇవ్వకుండా నిలిపేస్తే ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనిని నియంత్రించడంలో వైఫల్యం కప్పిపుచ్చుకోనేందుకు 2016లో 12వ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. అనుమతి లేని అవుట్‌లో కొనుగోలు చేసిన స్థలంలో గృహ, భవనాలు, వ్యాపార సముదాయాలకు సబ్ రిజిస్ట్రార్ ఆధారంగా మార్కెట్ విలువలో 14 శాతం రుసుం జమ చేయగానే నిర్మాణ ఆకృతి పత్రాలను పంచాయతీ కార్యదర్శులు జారీ చేస్తున్నారు.
ఎడతెగని పంచాయితీ...
● జిల్లాలోని 791 పంచాయతీల్లో 14 శాతం కన్నా తక్కువ రుసుం కట్టించుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహరంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్న బాధ్యులపై విచారణ, చర్యలు గడపదాటకపోవడం గమనార్హం.
సామాజిక కట్టడాలకు స్థలాల కొరత...
● జిల్లాలోని 791 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ స్థలాలకు కొరత తీవ్రంగా ఉంది. 50 మండలాల పరిధిలోని 631 సచివాలయాలు, 597 రైతు భరోసా కేంద్రాలు, 500 విలేజ్ హెల్త్ క్లీనిక్ నిర్మాణాల కోసం స్థలాలకు కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య వల్ల పలు చోట్ల కట్టడాలను చేపట్టని పరిస్థితులు ఉన్నాయి. 1,570 అంగన్‌వాడీ కేంద్రాలకు సరిపడే స్థలాలు దొరకలేదు. లే-అవుట్ ప్రకారం 10 శాతం సామాజిక స్థలాలు అందుబాటులో ఉంటే ఈ తరహా సమస్యలు ఉండవని పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది చెబుతున్నారు. నిబంధనలను తోసిరాజని నిర్మించిన బహుళ అంతస్థుల నివేశన సముదాయాలను మార్జిగేజ్ పద్ధతిలో పంచాయతీ పేరు మీదుగా గదులను రిజిస్ట్రేషన్ విధానం తుస్సుమన్పిస్తున్నారు.