Neelam Pramila Fake resignation letter: రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపులకు అడ్డు అనేది లేకుండా పోతోంది. వారు ఇష్టారాజ్యంగా రెచ్చి పోతుంటే పోలీసులు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే వైసీపీలో ఇమడలేక తెలుగుదేశంలో పార్టీలో చేరడం.. కమలాపురం పురపాలక కౌన్సిలర్ నీలం ప్రమీల దంపతులకు శాపంగా మారింది. ఆమె భర్త నీలం నరేంద్రపై రెండు తప్పుడు అత్యాచారం కేసులు నమోదవగా.. ఓ కేసులో మూడు రోజులు జైలుకెళ్లి వచ్చారు. మరో హత్య కేసులోనూ ఇరికించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కౌన్సిలరుగా గెలిపించడానికి రూ. 25లక్షలు ఖర్చయిందని.. ఆ మొత్తాన్ని చెల్లించాలని దౌర్జన్యానికి దిగుతున్నారు. చివరికి ఫోర్జరీ సంతకంతో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం తీర్మానం కూడా ఆమోదించారు. అయితే తాను రాజీనామా చేయలేదని అధికారులకు కౌన్సిలర్ ప్రమీల మొర పెట్టుకున్నారు.
తెల్ల కాగితంపై సంతకం..వైసీపీలో నాయకుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ వైఎస్సార్ జిల్లా కమలాపురం 20వ వార్డు కౌన్సిలరు నీలం ప్రమీల, ఆమె భర్త నరేంద్ర.. గత నెల 18న తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంటనే కౌన్సిలరు ఇంటికి వెళ్లిన నలుగురు వైసీపీ నేతలు.. ఆమెను గెలిపించడానికి ఖర్చయిన రూ.25లక్షలు చెల్లించాలని.. లేదంటే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈలోపు మహిళా, శిశుసంక్షేమ సంఘం జిల్లా ఛైర్‌పర్సన్ పి. మేరీ.. తన ట్రాక్టరు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉండటంతో వారిని కలిశారు. ఈ సమయంలో ఎస్సై చిన్న పెద్దయ్య తెల్ల కాగితంపై సంతకం చేయాలని కోరగా.. ఎందుకని ఆమె ప్రశ్నించారు. జామీను కోసమంటూ ఖాళీ కాగితంపై సంతకం చేయించుకున్నారు. తర్వాత మేరీపై నీలం నరేంద్ర అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాను చేయని ఫిర్యాదు ఆధారంగా నరేంద్రపై కేసు ఎలా పెడతారని ఎస్సై చిన్న పెద్దయ్యను మేరీ ప్రశ్నించారు. ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి.. నరేంద్రపై తాను ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కమలాపురం కోర్టు జడ్జి ముందూ వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత జైల్లో ఉన్న నరేంద్ర విడుదలయ్యారు. ఇటీవల కమలాపురం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత హత్యకు గురయ్యారు. ఈ కేసులో నరేంద్రను అనుమానితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.