Handloom Workers Agitation in AP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేశారని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున ఆరోపించారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేనేత సొసైటీల వద్ద నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మిక కుటుంబానికి మూడు సెంట్ల స్థలం :విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో చేనేత వస్త్రాలను వినియోగించాలని మల్లికార్జున కోరారు. జీఎస్టీ వల్ల చేనేత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. తక్షణం చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేతసహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. నేతన్న నేస్తం పథకాన్ని ప్రతి కార్మికుడికి వర్తింపచేయాలని, చాలా మంది కార్మికులకు నేతన్న నేస్తం అందడం లేదని పేర్కొన్నారు. చేనేత కార్మిక కుటుంబానికి మూడు సెంట్ల స్థలం మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇది చదవండి:Lokesh on Handloom Workers: రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: లోకేశ్
చేనేత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావన :చేనేతల సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత రెండో స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించాల్సిన రాజకీయ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చేనేత సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.