ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Football Betting Apps: ఫుట్‌బాల్‌ యాప్‌తో బెట్టింగ్‌ దందా.. సీజ్ చేసిన పోలీసులు.. - కడప జిల్లా లేటెస్ట్ న్యూస్

Football Betting Apps: తక్కువ సమయంలోనే లక్షాధికారి కావచ్చనే మాయ మాటలు చెబుతూ.. వందలాది మందిని బెట్టింగ్ దందాలో దింపుతున్నారు. జీవీ ఫుట్ బాల్ యాప్‌లో ఉద్యోగులు, నాయకులు, పోలీసులు విచ్చలవిడిగా పెట్టుబడి పెడుతున్నారు. కడపలో ఓ పోలీసు అధికారి, ఓ వైసీపీ నాయకుడు నిర్వాహకులుగా అవతారమెత్తి దందా నడుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వందల మందిని గొలుసుకట్టు విధానంలో ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Football Betting Apps
ఫుట్‌బాల్‌ యాప్‌తో బెట్టింగ్‌ దందా

By

Published : May 13, 2023, 8:24 AM IST

ఫుట్‌బాల్‌ యాప్‌తో బెట్టింగ్‌ దందా

Football Betting Apps: "జీవీ ఫుట్ బాల్" యాప్.. ఇపుడు ఈ పేరు ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాలో మారుమోగిపోతోంది. రెండు నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నఈ యాప్ నిర్వాకాన్ని పోలీసులు పసిగట్టారు. నిర్వాహకుల మాటలు నమ్మి ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన.. ఉమ్మడి జిల్లా వాసులు పోలీసుల చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత నెల 29న కడప ఒకటో పట్టణ పోలీసులు దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి.. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

తర్వాత దర్యాప్తు జరిపి ఇప్పటి వరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. జీవీ ఫుట్ బాల్ యాప్‌ను వైఎస్సార్ జిల్లాకు పరిచయం చేసింది.. ఓ వైసీపీ నాయకుడు, ఓ పోలీసు అధికారి అని తెలుస్తోంది. వారిద్దరికున్న పరిచయాలతో వందలాది మందిని యాప్‌లో పెట్టుబడులు పెట్టించినట్లు తేలింది. ప్లేస్టోర్‌లో లభించని ఈ జీవీ ఫుట్ బాల్ యాప్.. కేవలం టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా లింకులు పంపి షేర్ చేస్తున్నారు. ప్రజలకు సులభంగా డబ్బు వస్తోందనే కారణంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భవిష్యత్తులో భారీ మొత్తంలో నిర్వాహకులు పెట్టుబడులు తీసుకుని మోసం చేసే అవకాశం ఉందని భావించి యాప్‌ను సీజ్ చేసినట్లు.. ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

గొలుసుకట్టు విధానంలో ఒక్కొక్కరు పది నుంచి 30 మంది వరకు యాప్‌లో చేరితే వారికి కమీషన్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బు వస్తోందనే ఆశతో విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓ పోలీసు అధికారి కడపలోని ఓ ఫంక్షన్ హాల్లో వందల మందితో ఇటీవలే విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. వచ్చిన వారందరితో జీవీ ఫుట్ బాల్ యాప్‌లో తోచిన విధంగా పెట్టుబడి పెట్టించినట్లు తెలుస్తోంది. చాలామంది కానిస్టేబుళ్లు, ఉద్యోగులు, హోంగార్డులు, కార్మికులు విరివిగా బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

15 రోజుల కిందట ఈ యాప్‌ను సీజ్ చేయడంతో.. భారీగా పెట్టుబడి పెట్టిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు మోసపోయినట్లు తమకు ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తామని పోలీసులు అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ నుంచి జీవీ ఫుట్ బాల్ యాప్‌ను నేరగాళ్లు నడుపుతున్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. రెండు వారాలుగా ఈ యాప్ పనిచేయక పోవడంతో.. నేరగాళ్లు మరో కొత్త యాప్‌ను ప్రచారంలోకి తెచ్చారు. జీవీ ఫుట్ బాల్ స్థానంలో మూన్ ఫుట్ బాల్ పేరుతో లింకులు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కొత్తగా వచ్చిన యాప్‌ను కూడా సీజ్ చేస్తామని.. ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details